గురు పరంపర

కృత యుగంలో దక్షిణామూర్తి, త్రేతా యుగంలో దత్తాత్రేయ స్వామి, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో ఆది శంకరాచార్యులు ఈ సర్వ జగత్తుకు గురువులు. భారతీయ హైందవ ధర్మం గురువే దైవం అని చెబుతోంది. అందుకే మాతృదేవోభవ... పితృ దేవోభవ... ఆచార్య దేవోభవ... న, గురురోరధికం అంటారు. ఈ తత్వం ఈ భూప్రపంచమంతా వెదకినా భారతదేశంలో తప్ప మరెక్కడా కనిపించదు. అందుకే! భారతదేశానికి గురుస్థానం దక్కింది. యావత్ జగత్తుకు గురువుగా భాసిలైన కారణంగానే జగద్గురువుగా పిలువబడుతోంది. గురుపరంపర అనేది భారతీయ ధర్మంలో భాగం.

పరమాత్మ

నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాస్తం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యమ శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యమ తం తోటకం వార్తికాకార మన్యాన్ అస్మత్ గురూన్ సంతతమానతోస్మి

పరమాత్మ నుండి అద్వైత జ్ఞాన ప్రవాహం ప్రారంభమైంది. పరమాత్మే నారాయణుడుగా ఈ విశ్వమంతటికీ జ్ఞానాన్ని అందించారు. అక్కడి నుంచే గురుపరంపర భీజం పడింది. గౌడపాదాచార్యులు - పద్మభవుడు(చతుర్ముఖ బ్రహ్మ) వశిష్టుడు నుంచి శుకుడ వరకు పౌరాణిక చరిత్రలో చాలా విశేషముగా చర్చించబడినది. కానీ, ఆ పరంపరలో గౌడపాదులు అవ్యక్తముగా తన జీవనమును గడుపుతూ ప్రపంచమునకు పరమపద స్థానముగా భావించిన హిమాలయ ప్రాంతములో శ్రీమన్నారాయుణుడు అవతరించిన బదరీ ప్రాంతములో గౌడపాదులు సంవత్సరముల పాటు తపస్సు చేసిన పుణ్యఫలము చేత అద్వైత జ్ఞానమునకు తొలి గురువైన ఆ నారాయణుడే గౌడపాదుల వారికి దర్శనమిచ్చి భగవద్గత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు వీటి సారమును సంపూర్ణముగా బోధించి యావత్ ప్రపంచమునకు తన అద్వైత సందేశమును ప్రకటించమని అందించిన శ్రీమన్నారాయణుడు దానిని తపోనిష్టుడైన గౌడపాదులు తన చర్య నిఘూఢముగా గడుపుతూ మాండుక్యోపనిషత్తుకి 254 కారికలు(శ్లోకములు) అనుగ్రహించి జనన మరణ రహితమైన అజాతవాదమును ప్రతిపాదించుచూ సమస్త తార్కిక లోకమును నిరాశపరుస్తూ ఈ అద్వైత ప్రతిష్టాపన కలియుగములో చేసిన తొలిగురువు గౌడపాదులే అంటే అతిశయోక్తి లేదు.

గోవింద భగవత్పాదులు - గౌడపాదుల యొక్క అజాతవాదమును అందిపుచ్చుకొనిన గోవింద భగవత్పాద పూజ్యులు పూర్ణమైన నిధ్యాసనపరులై అద్వైత జ్ఞానమనే ప్రకాశముతో ఆకాలములో ప్రకాశించుచున్న జ్ఞానమూర్తి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి సన్యాసదీక్షను అనుగ్రహించిన గురుశ్రేష్టులు గౌడపాదాచార్యులు. అటువంటి గౌడపాదాచార్యులు ఈ అజాతవాదమైన అద్వైత తత్త్వమును నిలబెట్టుటకు జ్ఞానదృష్టితో వీక్షించినపుడు సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతారమే ఆర్యాంబా శివగురువులకి సజ్ఞ్యోజాతుడుగా ఉద్భవించిన శ్రీ శంకరుడు గోవింద భగవత్పాదాచార్యుల చెంతకు చేరి ఆది శంకరాచార్యులుగా లోకమునకు దర్శనమిచ్చిన శంకరుడు లోక శంకరుడు.

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామి

అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్’
షోడశే కతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్ ’’

సాక్షాత్ పరబ్రహ్మయే ఆర్యాంబా శివగురువులకు సజ్ఞ్యోజాతునిగా శ్రీ శంకరుడు ఉద్భవించెను. గోవింద భగవత్పాదాచార్యులు అజాతవాదమైన అద్వైతము నిలుపుటకు జ్ఞానదష్టితో వీక్షించినపుడు శ్రీ శంకరుడు తారసపడినటువంటి బాలశంకరుని శిష్యుడిగా చేసుకుని సంపూర్ణ అద్వైత తత్త్వమును ఉపదేశించి సన్యాసదీక్షను అనుగ్రహించిరి. ఆనాటి నుండి పైన చెప్పిన శ్లోకము విధముగా పరమాత్మ యొక్క అవతారమే కనుక 8 సంవత్సరముల ప్రాయములోనే నాలుగు వేదములను, 12వ ఏటనే సకల శాస్త్రములను, 16వ సంవత్సరమున వేద శాస్త్రములను స్వ అనుభవముతో విహితము చేసి ప్రన్ధానత్రయ(భగవద్గిత, ఉపనిషత్తులు,బ్రహ్మసూత్రమ) భాష్యమును రచించిరి. ఆసేతు హిమాచలము మూడు పర్యాయములు పర్యటించి బ్రహ్మాత్మ ఏకత్వ విజ్ఞానముతో కూడిన అద్వైత విస్పష్టత చేయుట వలన క్రాంతి దర్శికులైనారు. శ్రీ శంకరులు సనాతన వైదిక ధర్మమునకు బద్దులైన వారు. సనాతన వైదిక ధర్మమును అనుసరించే ఇతర తత్త్వ విచారుల కంటె శంకరుల యొక్క తత్త్వ విచారము విలక్షణమైనది. శ్రీ శంకరులు ప్రచండ భాస్కరుల వలె దేదీప్యమానులై వారి భాష్యమునందు సర్వ కాలీనముగాను, సర్వ జనీనముగాను, పూర్ణానుభవముగా కాలదేశభాములను మీరిన తత్త్వమును గుర్తించినపుడు అదే మన అందరి నిజమైన ఉనికి అని తెలిసినపుడు కాల దేశముల పరిచ్ఛేదము లేని వట్టి ఉనికియే మనమై ఉండుట చేత ఏ విధమైన బంధము మనకు ఎప్పుడు లేదను అనుభవమే నిలిచిపోవును. ఈ నిలకడనే మోక్షము “ముక్తి" అందురు. ఆ కారణము చేత బ్రహ్మానుభవమే మోక్షము అని ఆచార్యుల సిద్ధాంతము. అటువంటి ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత నిధి ఈ జగత్తుకి ఎంతో అవసరము. వారు భగవద్గీత భాష్యములో తెలిపిన సాంప్రదాయ “అద్యోరోప అపవారాభ్యం నిష్ప్రపంచం త్రవంచతే” అనే విధముగా విశాఖ శ్రీ శారదాపీఠం గురు సంప్రదాయము కొనసాగించుచున్నది. వైదిక సంప్రదాయ పీఠములో ఎక్కడాలేని విధముగా పరిశుద్ధ శంకర భాష్యమును నిత్యము శిష్యులకు ప్రబోధిస్తూ మరియు లోకానుగ్రహము కోసం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి పీఠార్చన మరియు శ్రీ చరుణులైన గురువులు అనన్యమైన ఉపాసనాదుల చేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తున్న విలక్షణమైన పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం.

బోధానందేంద్ర సరస్వతి: బోధానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు విశాఖ శ్రీ శారదాపీఠానికి పరాపర గురువులు. అత్యంత జ్ఞాన నిష్టులు. ప్రాతః స్మరణీయులు. బోధానందేంద్ర సరస్వతి స్వామి గురుపరంపరను కొనసాగించేందుకు సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామికి శిష్య తురీయాశ్రమ దీక్షను అనుగ్రహించారు.

అపర శంకరులు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామి

అపర శంకరులు సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామి. విశాఖ శ్రీ శారదాపీఠానికి పరమేష్టి గురువులు. పరమ పూజ్యులైన శ్రీశ్రీశ్రీ సచ్చిదానందేంద సరస్వతీ మహాస్వామి వారు 1880 వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరంలో మహాసమాధి పొందారు. వారి దీర్ఘ జీవన యాత్రలో యావత్ ప్రపంచం కొరకు, ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం పాటుపడ్డారు.. తన జీవితాన్ని కేవలం పరమార్ధికం వైపే నడిపించారు. మోక్షం కొరకు జిజ్ఞాసులు వస్తే వారికి శంకర అద్వైత తత్వాన్ని ఉపదేశిస్తూ ఎంతోమందిని ఆధ్యాత్మిక సాధకులుగా తీర్చిదిద్దారు. వారికి తెలిసిన వారిని ఎవరినైనా అడిగితే వారు సంసార జీవితమందు పూర్తిగా విరక్తి కలవారని, ఒక ఋషి లేదా జ్ఞాని ఎలా జీవిస్తారో వారు కూడా అదే విధంగా జీవిస్తూ ఉండేవారని అనేక మంది తెలిపేవారు. ఎటువంటి మహాత్ములకైనా స్వామి వారు పరమహంస సన్యాసమునకు సారాంశంగా నిలిచేవారు. అంతేగాకుండా అతి చిన్న వయసులోనే సాధువులు, సంతువుల సాంగత్యం కలిగి ఉండేవారు. బ్రహ్మ చైతన్య సద్గురు మహారాజ్ నుంచి రామతారక మంత్రాన్ని ఉపదేశంగా పొందారు. ఇక్కడొక గమ్మతైన విషయమేమిటంటే బ్రహ్మ చైతన్య సద్గురు మహారాజు నుంచి రామతారక మంత్రాన్ని ఉపదేశంగా పొందాలని సంకల్పించారు సచ్చిదానందేంద్ర. వారియొక్క ఆశ్రమం హెబ్బళ్ళిలో ఉందని తెలిసి అక్కడికి బయలుదేరారు. సచ్చిదానందేంద్రను చూసిన సద్గురు మహారాజ్ ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతూనే నా వద్ద రామతారక మంత్రాన్ని ఉపదేశంగా పొందాలని అనుకుంటున్నారు కదా అని చిరునవ్వు నవ్వారు. ఆ మాటలు విన్న సచ్చిదానందేంద్ర ఆశ్చర్యచకితులయ్యారు. నేను నా మనసులో సంకల్పించుకున్న విషయం వారికెలా తెలిసిందోనని ఆశ్చర్యపడ్డారు. బ్రహ్మ చైతన్య మహారాజ్ సచ్చిదానందేంద్రను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. ఆ సమయంలో సద్గురు మహారాజ్ హృదయం నుంచి రామ్ రామ్ అనే శబ్దం సచ్చిదానందేంద్రకు వినపడింది. తద్వారా సచ్చిదానందేంద్ర స్వామి వారు ఏ లక్ష్యంపై సద్గురు మహారాజ్ ను కలవాలనుకున్నారో ఆ కార్యం పూర్తయింది. ఆ క్షణం నుంచి సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామివారు శ్రీరామచంద్రుని ఉపాసన చేస్తూ ఉండేవారు. ఒకానొక నాడు ఉపాసనలో నిమగ్నమైన సమయంలో బోధానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దర్శనమిచ్చారు. ఆయనే సచ్చిదానందేంద్ర స్వామికి సన్యాసదీక్షను అనుగ్రహించారు. ఆఖరిరోజున దండ కమండలాలు, ప్రణవ మహావాక్య ఉపదేశాలతో పాటు శ్రీ సచ్చిదానందేంద సరస్వతిగా యోగపట్టాను అనుగ్రహించారు. అనంతరం గురువులకు భిక్ష అందించాలన్న ఉద్దేశ్యంతో నదిలో స్నానమాచరించి బయటకొచ్చేసరికి గురువులు బోధానందేంద్ర సరస్వతి కనిపించలేదు. వెదగ్గా వెదగ్గా అశ్వద్ధ వృక్షం సమీపంలో దూరం నుంచి కనిపించారు. కానీ, ఆ వృక్షాన్ని చేరేసరికి అంతర్ధానమయ్యారు. దీంతో తనకు సన్యాస దీక్షను ప్రసాదించేందుకు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే బోధానందేంద్ర సరస్వతి రూపంలో వచ్చారని భావించారు. మానవాళి సహాయం కొరకు స్వామి వారు చేసిన రెండు ప్రయత్నాలు ఈనాటికి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మొదటిది ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాలయం. రెండోది వేదాంత శాస్త్ర గ్రంధ రాజములు. శ్రీ స్వామివారు 1920వ సంవత్సరంలో ఆధ్యాత్మిక ప్రకాశ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈకార్యాలయం నుంచే ఆధ్యాత్మ ప్రకాశ అనే మాస పత్రిక 1923 నుంచి ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో సీతా రామచంద్రుల విగ్రహ ప్రతిష్ట చేసారు. దానికి ప్రధాన కారణం భక్తి భావాన్ని పెంచేందుకే. కార్యాలయం నుంచి ఇంగ్లీష్, సంస్కృత, కన్నడ భాషల్లో సుమారు 200కు పైగా పుస్తకాలను స్వామివారు ప్రచురించారు. శుద్ధ శంకర తత్వాన్ని బయటకు తీసి సాధారణ మానవాళికి అందించడమే స్వామి వారి లక్ష్యం. స్వామివారు తన అన్ని వేదాంత గ్రంధాల్లో శుద్ధ శంకర వేదాంత తత్వాన్ని నవీన వేదాంతులు తప్పుదోవ పట్టిస్తున్న సమయంలో రుజుత్వాన్ని సుస్పష్టం చేసే విధంగా ఆయన రచనలు ఉండేవి. అందుకని కన్నడ శంకర, అభినవ శంకర అనే బిరుదులు స్వామి వారి పాదాక్రాంతమయ్యాయి. స్వామివారు తమ జీవితాన్ని కేవలం అధ్యాపనం, అధ్యయనమందే సమర్పించారు. తన వాక్కు నుంచి శబ్ద తరంగాల ద్వారా సమస్త మానవాళికి పరాభక్తిలో నిమగ్నమయ్యేలా చేసేవారు. ప్రశాంతమైన నదీజల ప్రవాహం వలె స్వామివారి జీవితం హెచ్చు తగ్గులు లేకుండా సాగింది. 1929వ సంవత్సరంలో తాను రచించిన మూలా విద్య - నిరాశ గ్రంధం తప్ప మిగతా గ్రంధాలేవీ విప్లవాత్మకంగా లేవు. అయితే మూలా విద్య - నిరాశ గ్రంధంలో కొన్ని విమర్శలు, ఇతర వ్యాఖ్యానకారులను ఎదిరించి ఉద్రిక్తత కలిగించినను తర్వాత మెల్లమెల్లగా ఆ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టింది. అయితే స్వామివారు వెలికితీసిన శుద్ధ శాంకర వేదాంత మర్మములను గ్రంధ రూపకంగా తీసుకొచ్చేవారు.

శంకర భాష్యముపై గల వ్యాఖ్యాన గ్రంథములలోని శ్రుతి, యుక్తి, అనుభవ విరుద్ధములైన అంశములను నిర్దాక్షిణ్యముగా, ధైర్యముగా ఖండించి, శ్రీ శంకరుల శుద్ధమైన భాష్య విచారములను శతాధిక గ్రంథ రచనల ద్వారా ప్రచారం నొనర్చి, ఒక విశ్వవిద్యాలయం కూడ చేయలేనంత మహత్కార్యమును, పరిశోధనలను ఒక్కరే గావించి విచార క్షేత్రమున మహా క్రాంతిని కలిగించి జిజ్ఞాసులకు మహా శాంతిని చేకూర్చి, శుద్ధ వేదాంతమైన భాష్యవిచారమును పునరుద్ధరించుటకు అవతరించిన అపరశంకరులే వీరు.

*అపూర్వమైన సమాగమం. తపోనిధిని జ్ఞాననిధి సమిపించిన శుభవేళ*

1961వ సంవత్సరంలో శ్రీ కంచి కామకోటి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ కురైకుడిలో ఉన్నారని తెలిసి శ్రీ సచ్చిదానందేంద్ర స్వామివారు వెళ్లి కలుసుకున్నారు. సచ్చిదానందేంద్ర స్వామి వారిని చూసిన వెంటనే కంచి కామకోటి జగద్గురువులు అక్కడ ఉన్న పండితులతో ఆశుప్తే రామతేహే కాలం నయేద్వేదాంత చింతయ అనే సూక్తికి అర్ధమేమిటని ప్రశ్నించారు. అందుకు పండితులు మానవుడు ఉదయం మేల్కొన్నప్పటి నుంచి నిద్రించే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వేదాంత చింతనలో కాలాన్ని గడపవలె అని అర్ధం చెప్పారు. ఈ వాక్యానికి జీవంతమైన ఉదాహరణ ఇదిగో! ఈ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారేనని కంచి కామకోటి జగద్గురువులు చూపించారు. కంచి కామకోటి జగద్గురువులు తపోనిధి అయితే పరమపూజ్య పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు విశాఖ శ్రీ శారదాపీఠ గురుపరంపరకు పరమేష్టి గురువులు జ్ఞాననిధిగా చెప్పవచ్చు. ఈరకంగానే జ్ఞాననిధి, తపోనిధి సంగమం అత్యంత విశేషంగా చెప్పవచ్చు. అలాంటి గొప్ప చరిత్ర గల సువిజ్ఞాన గనులైన విశాఖ శ్రీ శారదాపీఠ గురుపరంపరలో అత్యంత ముఖ్యులు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు. వారు గురు పరంపరను కొనసాగించేందుకు శ్రీశ్రీశ్రీ అద్వైతానందేంద్ర సరస్వతీ స్వామివారికి సన్యాసదీక్షను అనుగ్రహించారు.

జ్ఞానమూర్తి శ్రీ అద్వైతానందేంద్ర సరస్వతీ స్వామి

ఆర్షధర్మం గొప్పతనాన్ని సమాజానికి చాటిన మహనీయుడు. పరమార్థిక చింతనతో ధర్మ నిష్టతో ఎలా సాధన చేయాలో సమాజానికి చూపించిన గొప్ప సాధకుడు. సన్యానాశ్రమ జీవితానికి దిశా నిర్దేశం చేసిన దార్శనికుడు. కర్నాటక రాష్ట్రం శివమొగ్గ పట్టణానికి అతి చేరువలో ఉన్న మత్తూరు అనే గ్రామాన్ని యావత్తూ సంస్కృత గ్రామంగా మలిచిన ఘనత విశాఖ శ్రీ శారదాపీఠం గురుపరంపరదే. పీఠానికి పరమ గురువులైన శ్రీ అద్వైతానందేంద్ర స్వామి వారు కులమతాలకతీతంగా మత్తూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను మాతృభాషగా స్వీకరించేలా చేసారు. అఖండ భారతావనిలోనే సంస్కృత గ్రామంగా గుర్తింపు పొందిన గ్రామం ఏదైనా ఉందంటే అది మత్తూరే. అక్కడ నివసింవే అన్ని సామాజిక వర్గాల వారు ఇప్పటికీ సంస్కృత భాషలోనే మాట్లాడతారు. ఈగ్రామం తుంగ నది తీరాన అతి సుందరంగా గోచరిస్తుంది. గ్రామంలో బ్రాహ్మణుల నివాసాల నుంచి వేద ధ్వని నిత్యం ఘోషిస్తూ ఉంటే వారి చేస్తున్న అగ్నిహోత్రాది కర్మల వల్ల యజ్ఞ ధూళి విస్పుటమవుతుంది. ఇంత నిబద్ధతగా ఉండటానికి గల కారణం పరమగురువులు, పరమపూజ్య, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ అద్వైతానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారే. వారు వేద వేదాంగాలను, ధర్మ శాస్త్రాలను బాగుగా ఎరిగిన వారు. సాక్షాత్తూ సచ్చిదానందేంద్ర స్వామి వారికి అనుంగు శిష్యులు. ముఖ్యంగా ధర్మ శాస్తాలల్లో వారిని మించిన పండితులు మరొకరు లేరని కర్నాటక రాష్ట్రంలోనే ప్రసిద్ధి. గురువులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారికి శ్రీ అద్వైతానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు సాక్షాత్తూ గురువులు. ఇటువంటి మహోన్నతమైన వైదిక గురు సంప్రదాయం విశాఖ శ్రీ శారదాపీఠానిది.

శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి

అది 1964 నవంబరు 8వ తేదీ. క్రోది నామ సంవత్సరం కార్తీక శుక్షపక్ష చవితి. ఇది ఒక్కమాటలో చెప్పాలంటే ఆది శంకరుని వారసుడు అవతరించిన రోజు. కారణజన్ముడు ఈ భువిపై కాలిడిన పర్వదినం. అదే శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారి జన్మదినం. ప్రపంచాన్ని జ్ఞానమార్గంలో నడిపే కార్యమే జీవిత ధ్యేయంగా మహాస్వామి వారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని దేరసాం గ్రామంలో కళ్యాణమ్మ, చిన్నయ్య పంతులు దంపతులకు జన్మించారు. ఆ రోజు నాగుల చవితి కావడం విశేషం. స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో నరసింహం అని పేరు. చిన్నయ్య పంతులు దంపతులకు కలిగిన ఆరుగురిలో చివరి సంతానం. అన్నప్రాశన రోజే భగవద్గీతను చేతపట్టారు. చిన్నతనంలోనే ఆధ్యాత్మిక రసరంగంలో ఓలలాడుతూ ఊరంతటినీ అబ్బుర పరిచేవారు. పరమాత్మ జ్ఞానంలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఔరా అనిపించుకొన్నారు. విద్యాభ్యాసం కోసం 1970లో అన్నతో కలిసి వాల్తేరుకు తరలివెళ్లారు. పెద్దన్నకు చేదోడువాదోడుగా ఉండేవారు. అటు అన్నకు తోడుగా ఉంటూ ఇటు చదువును కొనసాగించారు. పిన్న వయసులోనే ఉపనయన సంస్కారం పూర్తి చేసుకుని నిత్యం గాయత్రీ ఉపాసన చేస్తుండేవారు. మహాస్వామి వారికి తొలినాళ్లలోనే మంత్రశాస్త్రంపై విశేష లాలస ఉన్నందున శ్రీరామచంద్ర భట్ వద్ద శిష్టాచారంతో మంత్రశాస్త్రాన్ని అభ్యసించారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసన దైవంగా భావిస్తూ నిరంతరం అక్షర లక్షలు చేస్తుండేవారు. ఈ క్రమంలోనే జ్ఞాన ప్రదాత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ స్వామి వారికి వేదాంతంపై నిశ్రేయశ మార్గం వైపు అడుగులు పడ్డాయి. తద్వారా అలౌకిక విషయాలపై చింతన లేకపోవడం, కుటుంబ సభ్యులకు చెప్పకుండా తమిళనాడు రాష్ట్రంలోని దేవాలయాల దర్శనానికి వెళుతూ ఉండేవారు. నరసింహం చేష్టల్ని తల్లదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండేవారు. ప్రాధమికంగా సంప్రదాయ కుటుంబం కావడంతో పలువురు యతీశ్వరులు ఇంటికి వస్తుండటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడం వంటివి జరుగుతూ ఉండేవి. వారి నుంచి వేదాంత విషయాలను సంగ్రహించేవారు నరసింహం. స్వాములను అడిగి వేదాంతపరమైన అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునే వారు. వేదాంత చర్చ చేస్తూనే విశాఖతీరంలోని శాంతి ఆశ్రమంలో నిర్వహించే వేదాంత సభలకు తరచూ వెళుతుండేవారు. ఆ సమయంలోనే గంగాధరం గారు తారసపడ్డారు. యోగాచార్యులు గంగాధరం ఆశీస్సులతో ప్రాణాయామం నేర్చి యోగసాధనపై పట్టు సాధించారు. ఆ మహానుభావుని వద్దనే యోగ వాసిష్టం, వేదాంత పంచదశి, వివేక చూడామణి గ్రంధాల సారాన్ని గ్రహించారు. ఆ సమయంలోనే ధర్మభూమి రుణం తీర్చుకోవడానికి కాషాయం కట్టాలని, సర్వసంగ పరిత్యాగిగా మారాలని తలచారు. అద్వైత సిద్ధాంత పునాదులపై జగతికి సుగతి సాధించాలని పరితపించారు. తల్లిదండ్రులను ఒప్పించి ఆధ్యాత్మిక యానంలో తొలి మజిలీకి శ్రీకారం చుట్టారు. వేదాంత విజ్ఞానం కోసం వెంపర్లాడుతూ రైలులో ఢిల్లీ ప్రయాణమైన మహాస్వామి.. అక్కడి నుంచి హరిద్వార్ చేరుకున్నారు. అక్కడ తారసపడ్డ ఓ సాధు పుంగవుని సూచనతో ఋషికేష్ పయనమయ్యారు. దేవభూమిగా పేరొంది రుషులు సంచరించే ఋషికేష్ పరిసరాలను హిమాలయ పాద ప్రాంతంగా చెప్పాలి. అక్కడ సద్గురువులు మహాజ్ఞానిగా పేరొందిన మేధానందపురిని కలిశారు. ఆధ్యాత్మిక చైతన్యం మహాస్వామిలో కనిపించడంతో మేదానందపురి ప్రోత్సహించారు. ఆ తరువాత శివానందాశ్రమం చేరుకొని మహానుభావులు దేవానందులను కలిశారు. అక్కడ నుంచి కైలాసాశ్రమంలో చేరి ఆశ్రమ ధర్మాన్ని తు.చ. తప్పక పాటిస్తూ అందరి కళ్లలో మెలిగారు. స్వామివారి శంకర భాష్యం, వ్యాకరణం కైలాసాశ్రమంలోనే అభ్యసించారు. అదే సమయంలో నారాయణానంద సరస్వతీ స్వామివారి వద్ద తర్కము, సాంఖ్యము, మీమాంస తదితర శాస్త్రాలను నేర్చుకున్నారు. నారాయణానంద సరస్వతి బహు కోపధారులు, క్రమశిక్షణాపరులు. స్వరూపానందేంద్ర స్వామివారు నిత్యం కైలాసాశ్రమం బ్రహ్మకాలంలో తెలవారుజాము 3 గంటలకే నిదలేచి, గంగాతీరాన స్నానమాచరించి అక్కడే సంధ్యవందనాది కార్యక్రమాలను ముగించుకుని ఆరు గంటలకు ప్రారంభమయ్యే శంకరభాష్యం పాఠాన్ని వినేవారు. ఈ పాఠం పూర్తి కాగానే శాస్త్రాలపై పట్టు కోసం నారాయణానంద సరస్వతి చెంతకు చేరేవారు. ఇందుకోసం ఉరుకులు పరుగుల మీదు దౌడు తీసేవారు. ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 నిముషాల వ్యవధిలోనే చేరుకునేవారంటే వేదాంత విజ్ఞానంపై ఆయనకుండే శ్రద్ధ ఎలాంటిదో చెప్పవచ్చు. ఒక్కక్షణం జాప్యమైనా పాఠం వినేందుకు నారాయణానంద అనుమతించక పోవడమే స్వరూపానందేంద్ర మహాస్వామి ఉరుకులు పరుగులకు కారణం.

వైరాగ్యానంద పరిచయంతో ఋషికేష్ గడ్డపైనే శంకర భాష్యం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆపై మంలో కొద్దికాలం గడిపారు. అక్కడి నుంచి మహాస్వామి వారి ప్రయాణం అంతా కంఠకీకారణ్యమనే చెప్పాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెదుక్కొంటూ దేవప్రయాగ వైపు పయనమయ్యారు. క్రూర మృగాల మధ్య, పురుగు పుట్ర లెక్క చేయకుండా రాత్రుళ్లు కొండ గుహల మధ్యే ఉంటూ ముందుకు సాగారు. ఈ సమయంలో మహాస్వామి వారికి ఎదురైన నాగ సాధువుల లీలా విలాసాలు అన్నీ ఇన్నీ కావు. శివాష్టకం, బిల్వాష్టకం చదువుకొంటూ ముందుకు నాగుతున్న మహాస్వామిని నాగ సాధువులు సైతం ఆదరించారు. కాలికి ముల్లు గుచ్చుకున్నా ఖాతరు చేయకుండా పండ్లనే ఫలహారంగా తీసుకొంటూ సాగిన మహాస్వామి ప్రయాణం బదరికావనం చేరుకుంది. అక్కడే నరనారాయణులు, రుషుల సాంగత్యం ఏర్పడింది. ఆ తరువాత పరమ పవిత్రమైన కేదార్ నాధ్ వైపు మహాస్వామి అడుగులు వేశారు. ఇంతలోనే వెదుక్కుంటూ వచ్చిన ఓ చేదువార్త మహాస్వామి చెవిన పడింది. యోగా గురువులు గంగాధరం ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో విశాఖకు తిరిగొచ్చారు. తనువు చాలించిన యోగా గురువుల కోరిక మేరకు ఆయన పార్ధివ దేహాన్ని మహాస్వామి తన చేతులమీదుగా లోతైన సముద్ర జలాల్లో ఖననం చేశారంటే ఆ గురుశిష్యుల మధ్య బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. విశాఖలోనే చినమషిడివాడలో ఓ కుటీరం ఏర్పాటు చేసుకొని ధర్మ ప్రబోధం చేస్తూ వచ్చారు. అక్కడే మహాస్వామికి శిష్యగణం ఏర్పడింది. ఈసారి ఆ సాధకులతో కలిసి ఋషికేష్, హరిద్వార్ లను సందర్శించారు. ఆ తరువాత కాలినడకన గంగోత్రి, యమునోత్రి, చార్ ధామ్ యాత్ర ఒకదాని తరువాత ఒకటిగా సాగిపోయాయి. ఇదే సమయంలో వేదవేదాంతాలకు భాష్యం చెప్పిన కన్నడసీమలోని హోళే నర్సిపూర్ గురించి మహాస్వామి చెవిన పడింది. అది పరమయోగులు సచ్చిదానందేంద సరస్వతీ మహాస్వామి కార్యక్షేత్రం. అక్కడకు చేరిన స్వరూపానందెంద్రులు వేదాంత రహస్యాలు నిక్షిప్తమై ఉన్న పరమార్థ చింతామణి గ్రంధాన్ని అధ్యయనం చేశారు. ఆ సమయంలోనే మహాస్వామిలో యతి కాంక్ష కొద్దీ సన్యాసాశ్రమ దీక్ష చేపట్టాలన్న ధ్యేయంతో పరమ యోగులు సచ్చిదానందేంద్ర సమాధి వద్ద ధ్యానం చేశారు. అలాగే, నిత్యానంద సరస్వతిని కలిశారు. ఆయన సూచన మేరకు వేద సమ్మతమైన జీవన విధానం అడుగడుగునా కనిపించేది. కర్నాటకలోని శివమొగ్గ జిల్లా మత్తూరు గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడ సన్యాస దీక్ష చెపడితే ధ్యానమార్గం సంప్రాప్తిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. వాస్తవానికి మత్తూరు గ్రామంలో ఇప్పటికీ దేవ భాష అయిన సంస్కృతమే వాడుకలో ఉంది. మైసూరు మహారాజు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆగ్రహారాల్లో మత్తూరు ప్రధానమైంది. అద్వైతానందేంద్ర మహాస్వామి వేంచేసి ఉన్న గ్రామమిది. ఈయన పరమ యోగులు సచ్చిదానందేంద్రకు స్వయానా శిష్యులు. భవబంధాలపై తనకు మక్కువ లేదని, మనిషి పుట్టుక వెనుక మర్మం తెలుసుకోవాలనే సన్యాసాశ్రమ జీవితాన్ని ఎంచుకున్నానని అద్వైతానందేంద్రకు వివరించి ఒప్పించారు. మహాస్వామిలో తొణికిసలాడిన చిత్తశుద్దిని చూసి ఆర్షధర్మం ఫరిఢవిల్లాలంటే ఇటువంటి యువత అవసరం ఎంతో ఉందని అద్వైతానందేంద్ర భావించారు. తల్లి అనుమతి పత్రంతో వస్తేనే సన్యాస దీక్ష ప్రదానం చేస్తానని చెప్పారు. వాస్తవానికి సన్యాసాశ్రమ జీవితాన్ని ఎంచుకొనే ముందు ఎవరైనా సరే పాటించాల్సిన నియమమిది. అద్వైతానందేంద్ర సూచన మేరకు విశాఖపట్నం చేరిన మహాస్వామి అతి కష్టం మీద తల్లిని ఒప్పించగలిగారు. అనుమతి పత్రంతో తిరిగి మత్తూరు బయలుదేరిన మహాస్వామి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ జ్ఞానానందేంద్ర సరస్వతిని, ఆ తరువాత కంచి వెళ్ళి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. శివరాత్రికి ముందు పౌర్ణమి రోజున మహాస్వామి సన్యాస దీక్షకు ముహూర్తం నిర్ణయించారు. వేద విద్యా ప్రవీణులతో సంకల్పం చేయించి సంస్కారాలు నిర్వహించారు. వేద విహితంగా జరగాల్సిన ఈ ప్రక్రియ మత్తూరు గ్రామస్థుల జయజయ ధ్వానాల మధ్య విజయవంతంగా పూర్తయింది. ఆ సమయంలోనే స్వరూపానందేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ యోగ పట్టాను అందించారు అద్వైతానందేంద్ర. సన్యాసిగా ఉత్తర కాశీలో భిక్షాటన చేస్తూ ధర్మ ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు మహాస్వామి చెప్పగా అద్వైతానందేంద్ర అందుకు అంగీకరించలేదు. పూర్వాశ్రమంలో నివసించిన విశాఖ నగరానికే వెళ్లి శంకర పీఠం స్థాపించాలని ఆదేశించారు. అలా పురుడు పోసుకున్నదే విశాఖ శ్రీ శారదా పీఠం. 1996లో యతిగా విశాఖ చేరుకున్నారు స్వరూపానందేంద్ర మహాస్వామి. హైందవ ధర్మ పరిరక్షణకు పాటు పడుతూ విజ్ఞాన ప్రసార కేంద్రంగా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. తన కుటీరానికి మహాస్వామి వారు ఉపనిషద్విహార్ అని అప్పట్లో నామకరణం చెశారు. ఎంతటి శాస్త్ర జ్ఞానం ఉన్నా సంప్రదాయ విరుద్ధ భావనలుంటే, మూర్ఖునితో సమానం. అందుకే! “నేను అనే విషయాన్ని తెలుసుకోవడమే నిజమైన అద్వైతం అంటారు స్వరూపానందేంద్ర స్వామి. “నేను ఎవరు” అనే విషయాన్ని తెలియజేసేందుకే కంకణం కట్టుకున్నారాయన. దానికి కేంద్రంగా, ప్రేరణను ఇవ్వగల మూలస్థానంగా పీఠాన్ని మలిచారు. ఈశ్వర సంకల్పంతోనే విశాఖ శ్రీ శారదా పీఠాన్ని నెలకొల్ప గలిగానని చెబుతుంటారు.

సంప్రదించండి

మీకు సంబంధించిన సమాచారం వేరెవరికీ చేరదు. గోప్యంగా ఉంటుంది.