విశాఖ శ్రీ శారదాపీఠం విశిష్టత
విశాఖ శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠం. తపో పీఠం. జ్ఞాన పీఠం. సిద్ధి పీఠం. సమాజంలో కాలానుగుణంగా ధర్మం నిర్వర్తించబడుతూ ఉండాలని తపిస్తుంది విశాఖ శ్రీ శారదాపీఠం. సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం భారతదేశంలో ఎవరైనా చేస్తున్నారంటే..అది విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారే. నిత్య నూతనమైన మానవ సమూహాలకు దిశా దర్శనం చేయిస్తున్న భారతీయ ధర్మం గంగా స్రోతస్వినిగా నిరంతరం ప్రవహింపజేయడానికి విశాఖ శ్రీ శారదాపీఠం అహర్నిశలు కృషి చేస్తోంది. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా అనుక్షణం ప్రబోధం చేసేటటువంటి గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోంది.
పీఠం లో వుండే ఆలయాలుబుద్ధి జీవుల్లో ఉండే కల్మషాన్ని, కశ్మలాన్ని, చీకటిని, ఆలోచనల్లో ఉండే అసమానతలను తొలగించి మానవుడిని ప్రేమమూర్తిగా తయారుచేసేవాడే గురువు. అలాంటి గురువులు ఈ సమాజానికి నిర్దేశకులు అవుతారు. మానవ జాతిని సన్మార్గంలో నడిపిస్తారు
నిరతం ధర్మపోరాటాలు, ధర్మప్రబోధాలు చేపట్టే చైతన్యమూర్తి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. భారతీయులంతా ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మప్రచారం చేయాలనేది గురువులు స్వరూపానందేంద్రుల సందేశం. ధర్మగ్లాని జరిగినపుడు శాస్త్రబద్ధమైన, విహితమైన సంప్రదాయాన్ని కాపాడాలి. శరీరం రాలిపోక ముందే ఇహంలోనే ఆత్మసాక్షాత్కారం కలగాలి. సర్వధర్మాలు పరమాత్ముని చేరడానికేనని శ్రీ చరణుల ఉపదేశం.